18, సెప్టెంబర్ 2010, శనివారం

ఇస్లాం పట్ల ఎందుకిలా జరుగుతోంది? ఎప్పుడైనా ఆలోచించారా?

ఒక క్రైస్తవ సన్యాసిని తల నుంచి పాదాల దాక నిండు వస్త్రాలు ధరిస్తే లోకం ఆమెను గౌరవిస్తుంది. ఆమె దైవసేవ కోసం అంకితమైందని చెబుతుంది. కాని అదే ఒక ముస్లిం మహిళ నిండు వస్త్రాలు ధరిస్తే ఆమె అణచివేయబడుతోందని గగ్గోలు పెడుతుంది ఈ సమాజం. ఇస్లాం పట్ల ఎందుకీ వివక్ష ?

ఒక యూదుడు గడ్డం పెంచితే అతను తన నమ్మకాన్ని
ఆచరిస్తున్నవాడౌతాడు. కాని అదే ఒక ముస్లిం గడ్డం పెంచితే అతన్ని తీవ్రవాదిగా ఎంచుతారు. ముస్లింల పట్ల ఎందుకింత దురనుమానం?

ఒక పాశ్చాత్య మహిళ ఇంటి పట్టున ఉండి కుటుంబాన్ని, పిల్లల్ని చూసుకుంటే ఆమె తన కుటుంబానికి మేలు చేస్తున్నత్యాగమూర్తి. మరి అదే ఒక ముస్లిం మహిళ అలా చేస్తే దిక్కులు పిక్కటిల్లేలా "కుటుంబ బానిసత్వం నుంచి ఆమెకు విముక్తి కల్పించాలి" అని నినాదాలు. ముస్లిం మహిళ విషయంలో ఏమిటీ వైపరీత్యం ?

తమ సబ్జెక్టు పై సాధన చేసే విద్యార్థులకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉందంటారు. కాని ఇస్లాం కోసం శ్రమించే విద్యార్థుల భవిష్యత్తు అంధకారమయమని నిరుత్సాహపరుస్తారు. ఇస్లాం పై ఎందుకింత కుల్లుబోతుతనం?

ఒక యూదుడు కాని క్రైస్తవుడు కాని హత్య చేస్తె అప్పుడు వారి మతం గురించి ఎవరూ మాట్లాడరు. కాని అదే ఒక ముస్లిం ఏదైనా నేరం క్రింద పట్టుబడితే అందరూ అతని మతాన్నే ఆడిపోసుకుంటారు. ఇస్లాం అంటె ఎందుకింత చులకన?

ఇతర అమ్మాయిలు తమకు ఏ దుస్తులు నచ్చితే ఆ దుస్తులు ధరించి విద్యాలయాలకు వెళ్ళవచ్చు. వారికి ఆ స్వేచ్చా స్వాతంత్రాలు ఉన్నాయి. కాని ఒక ముస్లిం అమ్మాయిలకు మాత్రం ఆ భాగ్యం లేదు. వారు నిండు దుస్తులు ధరించి కాలేజీలకు వెళితే యాజమాన్యాలు వారిని లోనికి రానీయరు. ఏమిటీ అన్యాయం?

ఒక వ్యక్తి ఎంతో మంది పరుల జీవితాలకోసం శాంతియుగమార్గంలో తన జీవితాన్ని త్యాగం చేసుకుంటే అతను గొప్పవాడు, గౌరవార్హుడు. కాని అదే ఒక ముస్లిం శాంతియుతమార్గంలో తన కుమారుడ్ని శత్రువుల చెరనుంచి కాపాడుకోవటానికి, తన సోదరుల చేతులు తెగిపోకుండ ఆదుకోవటానికి, తన అమ్మలక్కల మానాభిమానాలను రక్షించటానికి, తన ఇల్లు ధ్వంసం కాకుండ ఆపటానికి, తన మస్జిదుల గౌరవం కాలరాయబడకుండ కాపాడటానికి ఆ పని చేస్తే అతను ఉగ్రవాది. ఎంత దౌర్జన్యం?

మనకు ఏవైన సమస్యలు ఎదురైతే వాటికి ఏ పరిష్కారాలు దొరికినా కళ్ళు మూసేసుకొని తీసుకుంటాము. కాని ఒక సమస్యకు పరిష్కారం ఇస్లాం ధర్మంలో మాత్రమే ఉందని తెలిస్తే అసలు కనీసం దాని వైపు చూడటానికి కూడ మనం ఇష్టపడం. ఎందుకింత దురభిప్రాయం.

ఒక అసమర్ధ డ్రైవరు లక్షణమైన కారుని అడ్డ దిడ్డంగా నడిపి ఒక రోడ్డు ప్రమాదానికి పాల్పడ్డాడు. అలాంటప్పుడు తప్పు కారుదని ఎవరైన అనగలరా?. కాని అదే ఒక ముస్లిం తప్పు చేస్తే ఇతరుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే ప్రజలు అక్కడ వేలెత్తి చూపేది ఇస్లాం వైపు. మరీ ఇంత అనాలోచితమా?

ఇస్లామీయ చట్టాలను ఒక్క మారైన పరిశీలించకుండ పాశ్చాత్య మీడియా తాన అంటే తందాన అంటు తలాడిస్తోంది మన చుట్టూ ఉన్న ఈ సమాజం. అతి కొద్దిమందికి తప్పితే ఖురాన్ ఏమి చెబుతుంది? ప్రామాణిక హదీసుల్లో ఏముంది? అని తెలుసుకోవాలన్న జిఙ్ఞాస ఎవరికీ లేదు.

ఇదంతా ఎందుకు ? కేవలం ముస్లిం అయినందుకేనా ?
కాని ఇలా చేసేవారిని ఒక విచిత్రం ఎగతాళి చేస్తోంది సుమా!
మీరు గమనించారో లేదో!

ఎవరు ఎంత దుష్ప్రచారం చేస్తున్నప్పటికి ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ధర్మం ఇప్పటికీ ఇస్లామే.

1 కామెంట్‌:

  1. వ్యాఖ్యలు చేసే వారు తమ పేరు, ఎంతవరకు చదువుకున్నారు, ప్రస్తుతం ఏమి చేస్తున్నారు మరియు ఏ మతమును ఆచరిస్తున్నారో తెలియజేసి వ్యాఖ్యలు చేయాలి. లేనిచో సమాధానం చెప్పబడదు.

    రిప్లయితొలగించండి